హరియాణాలో దారుణ ఘటన జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హత్యకు(Family murder) గురికావడం కలకలం రేపింది. అయితే.. ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆ కుటుంబానికి చెందిన 20 ఏళ్ల కుమారుడే(Son killed family) వారిని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఏం జరిగింది?
ఆగస్టు 27న హరియాణా రోహ్తక్(Rohtak news) విజయపురి కాలనీకి చెందిన మల్లయోధుడు, ప్రాపర్టీ డీలర్(Property dealer murder) ప్రదీప్ అలియాస్ బబ్లూ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ప్రదీప్‌తో పాటు ఆయన భార్య బబ్లీ, నాన్నమ్మ రోషిణి, కుమార్తె తమన్నాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపాడు. గాయపడ్డ తమన్నాను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒప్పుకున్నాడు..
దర్యాప్తులో భాగంగా ప్రదీప్ కుమారుడు అభిషేక్(20)ను ప్రశ్నించగా తానే నేరం చేసినట్లుగా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నేరం చేసేందుకు వినియోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"దర్యాప్తు సమయంలో తమ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని అభిషేక్ చెప్పాడు. నిందితుడు తరచూ పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చాడు. దాంతో అనుమానం వచ్చి అరెస్టు చేశాం. అరెస్టు తర్వాత దర్యాప్తులో తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య తర్వాత అభిషేక్ తన స్నేహితునితో కలిసి హోటల్‌కు వెళ్లాడు. ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజిని మేం స్వాధీనం చేసుకున్నాం" అని పోలీసులు తెలిపారు. ఈ హత్యలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాతే ఈ హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.
ఇదీ చూడండి: చికెన్ వండలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త!
ఇదీ చూడండి: పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి..!