సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్, చైనాల మధ్య 12వ విడత ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఎల్‌ఏసీ వెంబడి చైనా భూభాగంలో ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద ఉదయం 10.30 గంటలకు ఇరు దేశాల సైనికాధికారులు సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్, గోగ్రా తదితర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఈ దఫా చర్చల్లో దృష్టి సారించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉద్రిక్తతలు సడలే అవకాశం!
తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాలూ భారీగా సైన్యాలను మోహరించాయి. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటికే 11 సార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగాయి. చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉభయ దేశాల సైనిక కమాండర్లు భేటీ అయ్యారు. వీటికి అనుగుణంగా పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. అయితే ఘర్షణకు కేంద్ర బిందువులుగా ఉన్న మిగతా ప్రాంతాల్లో సైనిక మోహరింపు కొనసాగుతోంది. నేటి చర్చలు ఫలిస్తే గోగ్రా లోయ, హాట్‌స్ప్రింగ్స్, దెమ్‌చోక్‌లో ఉద్రిక్తతలు సడలే అవకాశమున్నట్లు తెలుస్తోంది.