కొత్త సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. జమ్ముశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావటం వల్ల తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు దిల్లీ, హరియాణా, పంజాబ్, జమ్ముకశ్మీర్ వాసులుగా గుర్తించారు. తెల్లవారుజామున 2.45గంటల సమయంలో ఘటన జరిగింది.
ప్రధాని మోదీ విచారం..
తొక్కిసలాటలో 12 మంది మృతిచెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతులు కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించారు మోదీ.
రూ.10 లక్షల పరిహారం
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పన పరిహారం ప్రకటించారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
రాహుల్ సంతాపం
మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
" మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. " అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.