Google Verified Check Marks For Websites : అంతర్జాలంలోని నకిలీ వెబ్‌సైట్లకు చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. వెబ్‌సైట్ అసలైనదా? లేదా నకిలీదా? గుర్తించేందుకు ఇకపై వెరిఫైడ్ బ్యాడ్జ్ అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి చాలా మంది మోసపూరిత వెబ్‌సైట్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని అరికట్టేందుకు గూగుల్ ఇకపై తన సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే ఫలితాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
"కంపెనీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం గూగుల్‌లోని నిర్దిష్ట వ్యాపారాల వెబ్‌సైట్ల పక్కనే చెక్ మార్క్‌లను చూపించేలా పరీక్షలు నిర్వహిస్తున్నాం" అని గూగుల్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ కంపెనీల అధికారిక సైట్ లింక్ పక్కన బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తోందని ధవెర్జ్ నివేదించింది. టెస్టింగ్ దశలో కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.