Telangana Formation Day 2024 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందుకు హాజరయ్యే అతిథులకు, మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజలకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కార్యక్రమాన్ని తిలకించేందుకు మైదానంలో రెండు ఎల్ఈడీ తెరలను అమర్చారు.
మరోవైపు ఇందులో భాగంగా పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ వేదికపైనే తెలంగాణ ప్రత్యేక గీతాన్ని సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకలకు వచ్చే పలువురు ప్రముఖులతో పాటు ఉద్యమకారులను రేవంత్‌రెడ్డి సన్మానించనున్నారు.