Re-Inquiry on Kaleshwaram : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మళ్లీ దర్యాప్తు కొనసాగించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లను రేపటి నుంచి శనివారం వరకు విచారించనుంది. అప్పటి ఈఎన్సీలను, ఉన్నతాధికారులను ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలో అన్ని నివేదికలు ఇవ్వాలని నీటి పారుదలశాఖను కమిషన్ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్‌మెంట్ రిజిస్టర్, ఎంబుక్‌లను కూడా తీసుకురావాలని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ విచారణలో కమిషన్‌ను తప్పుదోవ పట్టించినా, నేరపూరితంగా వ్యవహరించినా వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని, భవిష్యత్‌లో పదోన్నతులు ఇవ్వవద్దని ప్రభుత్వానికి సిఫారసు చేసే యోచనలో ఉన్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వెల్లడించింది. తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కాళేశ్వరం నివేదిక ఆధారంగా కాగ్ అధికారుల నుంచి కూడా వివరాలు తీసుకోనున్నట్లు కమిషన్ తెలిపింది.