Food poison at model School : మెదక్ జిల్లా రామాయంపేట ఆదర్శ పాఠశాల వసతి గృహంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లి పడిన అల్పాహారం తీసుకున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 17 మందిని పరీక్షించిన వైద్యులు, తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరి విద్యార్థినులను పరిశీలనలో ఉంచారు.
ఉదయం విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో బల్లి పడడం గమనించి వెంటనే పాఠశాల కేర్ టేకర్ విద్యార్థులందరిని తినవద్దని హెచ్చరించారని, అయినప్పటికీ 17 మంది విద్యార్థులకు వాంతులు వచ్చినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. స్కూల్‌లో పనిచేసే వంట మనిషితోపాటు వంట సహాయకులను విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించారు. మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు.