Farmer suicide attempt in shamshabad : అధికారులు భూసమస్యను పరిష్కరించడం లేదని, మనస్థాపం చెందిన రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే శంషాబాద్ గ్రామానికి చెందిన చిన్నకేశ కమలమ్మ, లక్ష్మయ్య దంపతుల పేరిట గాన్సీమియగూడ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల భూమి ఉంది. తమ భూమిని ధరణి నుంచి తొలగించారని అధికారులకు గత సంవత్సరం నుంచి ఫిర్యాదు చేస్తున్నారు.
తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని ఇవాళ కుటుంబంతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కమలమ్మ కుమారుడు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకొని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మార్వో నాగమణి వివరణ ఇస్తూ వారి అప్లికేషన్ పరిశీలనలో ఉందని, ధరణిలో వారి భూమి డిలీట్ కావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు.