Man Died Due to Meat Stuck in His Throat : మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, రాజు(35) అనే వ్యక్తి మాంసం తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వండి మధ్యాహ్న భోజనంలో వడ్డించారు. రాజు భోజనం చేస్తూ ఎముక తిన్నాడు. ముక్క గొంతులో అడ్డం తిరిగి ఇరుక్కుపోయింది. దీంతో ఆయన ఇబ్బందులకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ముక్క తీసే ప్రయత్నం చేశారు.
కానీ ముక్క రాకపోగా ఊపిరి ఆడక ఆయన ఇంట్లోనే శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులకు గురై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. పరిస్థితి గుర్తించి ఆసుపత్రికి తరలించే లోపే బాధితుడు మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో కుటుంబ సభ్యులు తేరుకునేలోపే అంతా ముగిసిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.