Taliban Women Voice Ban : అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్లు మరోసారి ఆంక్షలు విధించారు! మహిళలు నమాజ్ చేసేటప్పుడు పక్కనున్న మహిళలకు వినపడకూడదని ఆదేశించారని ఓ అంతర్జాతీయ కథనం పేర్కొంది. ఒకరి సమక్షంలో మరొకరు బిగ్గరగా ప్రార్థన చేయడాన్ని నిషేధిస్తూ తాలిబన్ మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఉత్తర్వులు జారీ చేసినట్లు అందులో తెలిపింది. మహిళలు ఖురాన్‌ను ఇతర మహిళలు వినిపించేలా గట్టిగా చదవకూడదని కథనంలో పేర్కొంది.
అంతర్జాతీయ కథనం ప్రకారం, మహిళల స్వరం కూడా 'అవ్రా' కింద పరిగణిస్తామని తాలిబన్ మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ తెలిపారు. మసీదులో మహిళలకు తక్బీర్ లేదా అజాన్‌కు అనుమతి లేనప్పుడు వారు పాడటం, సంగీతాన్ని ఆస్వాదించలేరని వ్యాఖ్యానించారు. త్వరలో ఈ నిబంధనను అమలు చేస్తామని పేర్కొన్నారు. తాము వేసే ప్రతి అడుగులో దేవుడు సాయం చేస్తాడని అభిప్రాయపడ్డారు.