North Korean Troops In Russia : ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో సాయంగా ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోందని నాటో ధ్రువీకరిస్తూ ఓ ప్రటనను విడుదల చేసింది. రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కిమ్ బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని, ఈ చర్య ఉన్న పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడమేనని వ్యాఖ్యానించారు.
రష్యాకు సాయంగా ఉత్తర కొరియా 3 వేల మంది సైనికులను పంపినట్లు ఇటీవల దక్షిణ కొరియా ఆరోపించింది. ఆ సైనికులకు రష్యా సైనిక యూనిఫామ్‌లు, ఆయధాలు, నకిలీ గుర్తింపు పత్రాలు అందించినట్లు పేర్కొంది. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల స్పందించిన అమెరికా ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది.