Nirmala Sitharaman About India's Per Capita Income : ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల వల్ల సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సుల్లో పాల్గొన్న ఆమె, వచ్చే ఐదేళ్లలో భారత తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అసమానతలు తగ్గడం సహా, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు.
"దేశ తలసరి ఆదాయం 2,730డాలర్లకు చేరేందుకు మనకు 75సంవత్సరాలు పట్టింది. మరో 2000డాలర్లను 5 ఏళ్లలోనే చేరుకోగలం. 2047నాటికి స్వాతంత్ర్యం సంపాదించి శతాబ్దం పూర్తికానుంది. ఆ సమయానికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవనుంది" అని సీతారామన్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల్లోని నిరర్థక ఆస్తుల విలువ కొన్నేళ్ల కనిష్ఠానికి చేరిందన్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద సమర్థవంతమైన రుణ రికవరీ విధానాలు ఉన్నాయని ఆమె చెప్పారు.