Wall Collapse Today : మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో మట్టి గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, షాపుర్కు చెందిన కొందరు చిన్నారులు శివలింగం చేసేందుకు స్థానిక ఆలయం వద్దకు వెళ్లారు. ఓ గోడ వద్ద కూర్చుని శివలింగం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిముద్దైన గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడిపోయింది. దీంతో అంతా మట్టి కింద చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు చిన్నారులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటనే చిన్నారులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ లేరని స్థానికులు ఆరోపించారు. పిల్లలకు తక్షణ చికిత్స అందక చిన్నారులు మృతి చెందారని చెప్పారు.