Mysterious Noise In Wayanad : కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మరో భయం అక్కడి ప్రజలను వెంటాడుతోంది. వైతిరి, బతేరి తాలూకాల్లోని అంబలవాయల్, అంబుకుతి, పోషుతాన, వెంగపల్లి, కొత్తతర, నెన్మెని ప్రాంతంలో భూమి కింద నుంచి శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఇది తమను ఎంతో భయాందోళనలకు గురిచేసిందని పేర్కొన్నారు.
వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు జియోలాజికల్ సర్వే నిర్ధరించింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూకంప సంకేతాలు లేవని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. భూమి కంపించిందనే వార్తలు నేపథ్యంలో ఆ ప్రాంతంలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.