Badlapur Sexual Assault Case: బద్లాపుర్‌లో నర్సరీ చదివే చిన్నారులపై జరిగిన లైంగికదాడికి నిరసనగా మహారాష్ట్రవ్యాప్తంగా మౌన దీక్షలు కొనసాగుతున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలోని ప్రతిపక్ష నేతలు, నోటికి నల్లరంగు మాస్కులు ధరించి మౌనదీక్ష చేపట్టారు. లైంగికదాడికి నిరసనగా మహావికాస్ అఘాడీ శనివారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, ఆ నిర్ణయంపై బాంబేహైకోర్టు నిషేధం విధించింది. రాజకీయ పార్టీలు, వ్యక్తులెవరూ బంద్ చేపట్టకూడదని ఆదేశించింది. ఈ క్రమంలో మౌనదీక్షలు చేపట్టాలని నేతలు నిర్ణయించారు.
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, కుమార్తె సుప్రియా సూలేతో కలిసి వర్షంలో తడుస్తూనే పుణెలో దీక్షలో పాల్గొన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చేతులను నరికే శివాజీ పాలించిన రాష్ట్రలో ఈ ఘటన జరగడం దారుణమన్నారు పవార్ వ్యాఖ్యానించారు. దేశంలో మహారాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిందని పేర్కొన్నారు. ముంబయిలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శ్రేణులతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం, దోషులపైచర్యలు తీసుకోకుండా నిందితుల పక్షాన నిలుస్తోందని ధ్వజమెత్తారు.