Kerala Police Operation P Hunt: ఇంటర్నెట్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫొటోల కోసం వెతికే వారిపై కేరళ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేరళవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సోదాలు చేసిన పోలీసులు 37 కేసులు నమోదు చేయడం సహా ఆరుగురిని అరెస్టు చేశారు. చిన్నారుల అశ్లీల కంటెంటు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొన్నేళ్లుగా పీ-హంట్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 455 ప్రదేశాల్లో తాజాగా సోదాలు నిర్వహించారు.
తిరువనంతపురం, కొల్లాం సిటీ, పథనంతిట్టా, మలప్పురం, కొయ్‌కోడ్ రూరల్, కాసర్‌గోడ్ జిల్లాల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. అత్యధికంగా మలప్పురం జిల్లాలో 60 చోట్ల సోదాలు జరిపి 23 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌లో చిన్నారుల అశ్లీల కంటెంటు చూడడం, స్టోర్ చేసుకోవడం, ఇతరులకు షేర్ చేయడం చట్టప్రకారం నేరం. దోషిగా తేలితే ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.