Shubhanshu Shukla Selected For NASA-ISRO Mission To ISS : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. అనూహ్య పరిణామాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే, ప్రత్యామ్నాయ ఏర్పాటు (బ్యాకప్) కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఎంపిక చేసింది. ఈ మిషన్‌ను అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అంతరిక్ష సంస్థ-నాసా గుర్తింపు ఉన్న సర్వీసు ప్రొవైడర్ 'యాక్సియమ్' సంస్థ సూచనల మేరకు ఇస్రో తాజా ఎంపిక చేపట్టింది.
ఐఎస్‌ఎస్‌కు యాక్సియమ్ నిర్వహించబోయే నాలుగో మిషన్ కోసం ఆ సంస్థతో తమ మానవసహిత అంతరిక్ష యాత్ర కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వివరించింది. ఇందుకు అనుగుణంగా నేషనల్ మిషన్ ఎసైన్‌మెంట్ బోర్డు ఇద్దరు భారత ‘గగన్‌యాత్రీ’ల (వ్యోమగాముల) పేర్లను సిఫార్సు చేసినట్లు వివరించింది.