Kolkata doctor rape case : వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉన్న వైద్య విద్యార్థులతో చర్చలు జరిపేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ నిరసనకారులు షరతులు విధించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చల్లో సీఎం పాల్గొనాలని, వాటిని లైవ్ టెలికాస్ట్ చేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా, ఆ షరతులకు అంగీకరించేందుకు సిద్ధంగా లేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ షరతులు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చల్లో పాల్గొనేందుకు సుముఖంగా లేరని తెలుస్తోందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేసినప్పటికీ విద్యార్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారన్నారు.