Film Chamber reacts on Jani Master : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను లైంగికంగా వేధించాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయగా జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా ఈ వ్యహారంపై తీవ్రంగా మండిపడింది.
కమిటీని ముందే ఆశ్రయించిన యువతి : హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన ఆ కమిటీ కన్వీనర్ దామోదరప్రసాద్, ఛైర్‌పర్సన్ ఝాన్సీ, సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ, వివేక్ కూచిబొట్ల, ప్రగతి, సామాజిక కార్యకర్త రామలక్ష్మి మేడపాటి, న్యాయవాది కావ్య మండవలు పలు విషయాలను వెల్లడించారు. అవకాశాలు పోతాయని చాలా మంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేయడం లేదన్నారు. జానీ మాస్టర్ వ్యవహారంలోనూ బాధిత యువతి ముందే తమ కమిటీని ఆశ్రయించిందని తెలిపారు.
ప్రతిభ ఉన్న అమ్మాయిలకు పరిశ్రమలో ఎప్పుడూ అవకాశాలు లభిస్తూనే ఉంటాయని ఝాన్సీ తెలిపారు. ఈ విషయంలో బాధిత యువతికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ, ఓ అగ్ర నటుడు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో గతంలో నియమించిన కమిటీ రిపోర్టు, బయటికి వస్తే పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు అవకాశం ఉందని ఝాన్సీ అన్నారు.
విచారణ చేపడుతాం : పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు గతంలో నమోదయ్యాయని, కొన్ని తమ దృష్టికి రావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. తమ కమిటీ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నామని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ తమవంతు బాధ్యతగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలకు పరిశ్రమ తరపు భరోసా లేకపోవడం వల్లే ఇష్టారీతిన ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తాత్కాలికంగా పక్కనపెట్టాలని కమిటీ ఆ అసోసియేషన్‌కు సిఫార్సు చేసింది. అలాగే ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేశామని, ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అందులో ఫిర్యాదులు వేయవచ్చని సూచించింది.
"అవకాశాలు పోతాయని చాలా మంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేయడం లేదు. ప్రతిభ ఉన్న అమ్మాయిలకు పరిశ్రమలో ఎప్పుడూ అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో గతంలో నియమించిన కమిటీ రిపోర్టు, బయటికి వస్తే పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు అవకాశం ఉంది". - ఝాన్సీ, ఛైర్‌పర్సన్, లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ
"పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు గతంలో నమోదయ్యాయి. కొన్ని మా దృష్టికి రావడం లేదు. మా కమిటీ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నాము. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ మా వంతు బాధ్యతగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నాము". - తమ్మారెడ్డి భరద్వాజ, సభ్యుడు, లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ
లైంగిక వేధింపుల ఆరోపణలు - జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ చర్యలు