IND VS BAN TeamIndia Coach Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాడిగా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలానే ఐపీఎల్‌లో మెంటార్‌గానూ సత్తా చాటాడు. మొత్తంగా దూకుడైన స్వభావం, విభిన్న వ్యూహాలతో కెరీర్లో ముందుకు సాగాడు. ఇప్పుడు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు.
ఇప్పటికే శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోనూ అడుగుపెట్టనున్నాడు. అయితే టీమ్ఇండియా ఆడబోయే భవిష్యత్ సిరీస్‌లు గంభీర్‌కు గట్టి సవాలు విసిరేవే అని చెప్పాలి.
ఎందుకంటే నెక్ట్స్ టీమ్ఇండియా బంగ్లాదేశ్‌తో 2, న్యూజిలాండ్‌తో 3, ఆస్ట్రేలియాతో 5 కలిపి మొత్తం 10 టెస్ట్‌లు ఆడనుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టేబుల్లో టాప్ పొజిషన్లో ఉంది రోహిత్ సేన. అంటే భారత జట్టు వరుసగా మూడో సారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలంటే ఇకపై కూడా నిలకడను కొనసాగించాల్సిందే. ఆ దిశగా జట్టును నడిపించే బాధ్యత గంభీర్‌దే. అయితే వరుసగా రెండు సార్లు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియా బోల్తా పడింది. కానీ ఈ సారి మాత్రం అలా కాకుండా చేయాల్సిన బాధ్యత గంభీర్‌దే. కాబట్టి ఆ దిశగా పక్కా వ్యూహాలతో గంభీర్ ముందుకు సాగాలి.
బౌలింగ్ చేసే బ్యాటర్లు కరువు - గతంలో టీమ్ఇండియాలో సచిన్ తెందుల్కర్, వీరెంద్ర సెహ్వాగ్, గంగూలీ, రైనా సహా పలువురు ఆటగాళ్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేసేవాళ్లు. దీంతో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఎక్కువ ప్రత్యామ్నాయాలు కనిపించేవి. కానీ ఇప్పుడలా లేదు. జట్టు అలాంటి ఆటగాళ్లు కరవయ్యారు. అయితే ఇప్పుడు గంభీర్ బౌలింగ్ చేయగల బ్యాటర్లను తయారు చేస్తున్నాడు. రీసెంట్గా లంకతో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లో రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయడమే ఇందుకు ఉదాహరణ. వీరు ఒక్క ఓవర్ మాత్రమే వేసి రెండేసి వికెట్లు తీశారు.
లంకతో జరిగిన వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ (మొదటి మ్యాచ్‌లో), రోహిత్ శర్మ (సెకండ్ మ్యాచ్‌లో) కూడా బౌలింగ్ చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కూ లెగ్‌స్పిన్ వేయగలిగే యశస్వి జైస్వాల్‌ను సిద్ధం చేస్తున్నాడు గంభీర్. జైశ్వాల్ గతంలో ఇంగ్లాండ్ జరిగిన రాంచి టెస్టులో ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 13 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ సంధించి 7 వికెట్లూ తీశాడు.
స్పిన్నర్లు ఎంతమంది?(IND VS BAN Spinners) - రీసెంట్గా స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచుల్లో టీమ్ ఇండియా ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తోంది. అయితే గంభీర్ దీన్ని మార్చనున్నట్లు తెలుస్తోంది. బంగ్లా దేశ్‌తో చెన్నైలో జరగబోయే మొదటి టెస్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను బరిలో దింపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ పేస్ పిచ్‌ను తయారు చేస్తున్నారు. పిచ్‌పై పచ్చిక పెంచుతున్నారని సమాచారం అందింది. అందుకే ఈ మ్యాచ్ కోసం పేసర్లు బుమ్రా, సిరాజ్, యశ్ దయాల్‌తో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజాను గంభీర్ తీసుకోవచ్చు. మూడో స్పిన్నర్‌ను బరిలో దింపాల్సి వస్తే దాని కోసం జైస్వాల్‌తో బౌలింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. దీని బట్టి జట్టు కూర్పు విషయంలో గంభీర్ పక్కా క్లారిటీతో ఉన్నాడని తెలుస్తోంది.
ఆ ముగ్గురిని తీసుకోవచ్చు(Teamindia Spinners) - జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయాల అవకాశాలు గంభీర్‌కు ఎక్కువగా ఉన్నాయి. జట్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్‌దీప్, అక్షర్ ఉన్నారు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 2 టెస్టులు ఆడిన అక్షర్ 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అశ్విన్ ఐదు మ్యాచుల్లో 26 వికెట్లు, కుల్‌దీప్ 4 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు, జడేజా 4 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి అదరగొట్టారు.
అంతకుముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ అక్షర్ రాణించలేకపోయాడు. 4 మ్యాచులు ఆడి 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ సిరీస్‌లో అశ్విన్, జడేజా వరుసగా 25, 22 వికెట్లు తీశారు. కాబట్టి బంగ్లాతో జరగబోయే తొలి టెస్టులో ముగ్గురు ప్రధాన స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా, కుల్‌దీప్‌ను గంభీర్ తీసుకోవచ్చు. వీళ్లలో ఎవరైనా ఫెయిల్ అయితే అక్షర్‌ను ఎంచుకోవచ్చు.
ఐదో స్థానం, వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ(5th Batting Order, WicketKeeper) - ఐదో స్థానం కోసం కేఎల్ రాహుల్ - సర్ఫరాజ్, వికెట్ కీపర్ స్థానం కోసం పంత్ - ధ్రువ్ జూరెల్ పోటీ పడుతున్నారు. అయితే మొదటి టెస్టులో రాహుల్, పంత్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లు తొలి టెస్ట్‌లో రాణించలేకపోతే ఇతర ఆటగాళ్లను గంభీర్ తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకే సర్ఫరాజ్‌ను దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ ఆడాక చెన్నైకి పిలిపించాడు గంభీర్. ఇకపోతే సిరాజ్ కూడా నిలకడగా రాణించాలి. లేదంటే యశ్ దయాల్ లేదా మరో పేసర్ అతడి స్థానాన్ని భర్తీ చేయొచ్చు.