మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ - అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు - YSRCP Leaders Stopped Peddireddy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 4:04 PM IST
YSRCP Leaders Stopped Minister Peddireddy Convoy: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు మంత్రి పర్యటనకు వెళ్తుండగా వి. కోట అంబేడ్కర్ సర్కిల్ వద్ద సొంత పార్టీ కార్యకర్తలే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పంచాయితీకి నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదంటూ మంత్రిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డుగా నిల్చుని నిరసన చేసి, తక్షణమే 20 కోట్ల నీటి బిల్లులు చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు. బకాయి బిల్లుల కోసం నాలుగున్నర ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని గోడు వెల్లబోసుకున్నారు.
అనంతపురంలో అడ్డుకున్న అంగన్వాడీలు: ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం పర్యటనకు సంబంధించిన సభా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న పెద్దిరెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్‌ను వెళ్లనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకుని దాదాపు అరగంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు. అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాగిపడేస్తూ అతికష్టం మీద మంత్రి వాహనాన్ని ముందుకు పంపించారు.