టీడీపీ మద్దతుదారులపై రాళ్లతో వైసీపీ నేతల దాడి - ఉరవకొండలో ఉద్రిక్తత - టీడీపీ నేతలపై వైసీపీ నేతల దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 3:54 PM IST
YSRCP Leaders Attack on TDP Leaders in Uravakonda: ప్రజల పక్షపాతిగా ఉంటూ న్యాయసేవలు అందించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ సానుభూతిపరులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమపై అధికార పార్టీ నేతలు దారుణానికి పాల్పడుతుంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని, న్యాయం జరిగే వరకు చికిత్స తీసుకునేది లేదని పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడు శ్రీనివాసులు బైఠాయించాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే - అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సానుభూతిపరులపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తుండగా అద్దాలను రాళ్లతో కొట్టి వైసీపీ నేతలు ధ్వంసానికి పాల్పడినట్లు టీడీపీ మద్దతుదారుడు మారెన్న కుమారుడు శ్రీనివాసులు తెలిపాడు. పాత కక్షల నేపథ్యంలో తమపై కట్టెలు, రాళ్లతో దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపాడు. దీంతో బాధిత కుటుంబం పోలీస స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో కూడా దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా పోలీసులు బాధితుడిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.