ప్రభుత్వ స్థలానికి కంచె వేసిన వైఎస్సార్సీపీ నాయకుడు - తొలంగించిన వీఆర్వోపై దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 3:25 PM IST
YSRCP Leader Attack on VRO: తమ తప్పుల్ని ప్రశ్నించినా, ఎదిరించినా వైఎస్సార్సీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు సామాన్యులైనా, ప్రభుత్వ ఉద్యోగులులైనా విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్థలం ఆక్రమణ అడ్డుకున్నాడని 26వ వార్డు సచివాలయం వీఆర్ఓపై వైఎస్సార్సీపీ నాయకుడు నర్సింహులు దాడికి పాల్పడ్డాడు. బాధితుడు వీఆర్ఓ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ రిజర్వ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకుడు నర్సింహులు ఆక్రమించి కంచె వేశాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులతో కలిసి కంచె తొలగించాం. దీంతో ఆగ్రహించిన నర్సింహులు సచివాలయానికి వచ్చి దాడి పాల్పడడమే కాకుండా కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై చేయి చేసుకున్నట్లు అశోక్ తెలిపారు. సహచర ఉద్యోగులు వారించడంతో నర్సింహులు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఘటనపై బాధిత వీఆర్ఓ ధర్మవరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీఆర్ఓపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నాయకుడిపై చర్యలు చేపట్టాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేశారు. అక్రమాలను అడ్డుకున్నాడనే కారణంతో వైఎస్సార్సీపీ నేత కార్యాలయంలోకి వచ్చి దాడులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.