బలం చాటుకునేందుకు వైఎస్సార్సీపీ నేతల తంటాలు - జనం రాక నిరుత్సాహం
🎬 Watch Now: Feature Video
YSRCP Bus Yatra in Mangalagiri: వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రకు మంగళగిరిలో ప్రజాదరణ లేకపోవడంతో, ఆ పార్టీ నాయకులు ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో బుధవారం వైఎస్సార్సీపీ బస్సుయాత్ర నిర్వహించింది. ఈ సభకు ప్రజలు అధికంగా తరలివస్తారని భావించిన ఆ పార్టీ నేతలకు నిరాశే మిగిలింది. యాత్ర సందర్భంగా నిర్వహించిన సభ ప్రాంగణంలోని దుకాణాలను బలవంతంగా ముయించారు. దుకాణాలకు అడ్డంగా వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభ ద్వారా బలాన్ని చాటుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు నానా ప్రయత్నాలు చేశారు. దాదాపు 10 వేల మంది వస్తారనే స్థాయిలో ఏర్పాట్లు చేయగా, దాదాపు 500 మంది కూడా రాలేదు. చేసేదేమీ లేక డ్వాక్రా సంఘాల మహిళలను సభకు తరలించారు. సభలో నేతలు ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రజలు సభ ప్రాంగణం నుంచి వెనుదిరిగారు. ఈ సభలో మంత్రులు జోగి రమేశ్, మేరుగ నాగార్జున, ఎంపీలు విజయసాయి రెడ్డి, నందిగం సురేశ్‌లు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించిన సమయంలో పేల్చిన బాణసంచా ధాటికి సమీప దుకాణాల అద్దాలు ధ్వంసం కాగా, రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.