అజ్ఞాతంలోకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి - జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా యోచన ! - వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 6:51 AM IST
Vemireddy Prabhakar Reddy Went To Hiding: నెల్లూరుకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం ఉన్నపళంగా నెల్లూరు నుంచి పయనమయ్యారు. కొద్ది రోజులపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులు, సిబ్బందికి సూచనలిచ్చారు. త్వరలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కొన్ని రోజులపాటు ఎవరినీ కలవబోనని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఆయన ఫోన్‌కు అందుబాటులో లేరని ప్రచారం జరుగుతోంది. ఈసారి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను అధిష్ఠానం ప్రకటించింది. తన పరిధిలోకి వచ్చే 3 శాసనసభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థులను మార్చాలని ఆయన తొలి నుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్ఠానం స్పందించకపోవడంతో కొన్ని రోజుల నుంచి అసంతృప్తితో ఉంటున్నారు.
తర్వాత మళ్లీ చురుగ్గా వ్యవహరించిన ఆయన నెల్లూరు నగర అసెంబ్లీ పార్టీ టికెట్ మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు రాకుండా చేసి పంతం నెగ్గించుకున్నారు. ఆయన స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అవకాశం కల్పించాలని కోరారు. ముస్లిం మైనారిటీలకు ఇవ్వదలిస్తే మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్‌కు కేటాయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. వైసీపీ అధిష్ఠానం ఇవేమీ పట్టించుకోకుండా అనిల్‌కుమార్ యాదవ్ అనుచరుడు ఎండీ ఖలీల్‌ను పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. ఇదే వేమిరెడ్డి మనస్తాపానికి కారణమైంది. సమన్వయకర్త ప్రకటనపై కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన అలకబూనారు. తనకు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే కానీ ఆ గౌరవం దక్కడం లేదని తన అనుచరుల ఎదుట వాపోయినట్లు సమాచారం. ఈ రాజకీయాలు తనకు సరిపోవని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సన్నిహితులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది.