జగన్‌కు సైకో వజ్ర, మాఫియా రత్న, విధ్వంస మిత్ర పురస్కారాలివ్వాలి: వంగలపూడి అనిత - Anitha criticized cm jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 10:04 PM IST
Vangalapudi Anitha Criticized CM Jagan : జీతాలు పెంచమన్న వాలంటీర్లను పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి చివరి రోజుల్లో వారే దిక్కయ్యారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. విషసర్పం పడగనీడలో ఉన్నామనే వాస్తవాన్ని వాలంటీర్లు గ్రహించాలన్నారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు సేవలందిస్తున్నానని చెప్పిన జగన్ రెడ్డి, 2.50 లక్షల యువతీ, యువకుల్ని తన బానిసలుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. ఉన్నత చదువులు చదివిన యువతకు రూ. 5 వేలు ఇచ్చి జగన్ పాలనలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా వారి భవిష్యత్‌ను నాశనం చేశాడని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు అవినీతికి పాల్పడ్డాయని అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని అనిత విమర్శించారు.
‘వాలంటీర్లకు వందనం’ పేరుతో జగన్ రెడ్డి వాలంటీర్లకు బిస్కట్లు వేయడం ఎన్నికల స్టంట్‌లో భాగమేనని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి వాలంటీర్ల ముసుగులో రూ. 2 వేల కోట్ల ప్రజల సొమ్ముని తన పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టాడని ఆరోపించారు. వాలంటీర్లకు బదులు జగన్ రెడ్డికి సైకో వజ్ర, మాఫియా రత్న, విధ్వంస మిత్ర పురస్కారాలు ఇవ్వాలన్నారు. జగన్ రెడ్డి ప్రతి మాటలో అతని హావభావాల్లో చంద్రబాబు, టీడీపీలపై ఉన్న భయం స్పష్టంగా కనిపించిందని ఎద్దేవా చేశారు. రక్తం పంచుకు పుట్టిన తల్లికి సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి, ప్రజల్ని మోసగించడానికి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడని వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.