వైఎస్సార్సీపీ పాలనలో వడియరాజులకు చేసిన మేలు ఏమీ లేదు : జీవీ ఆంజనేయులు - vadiyaraju meeting
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 12:17 PM IST
Vadiyaraju Consciousness Conference at Palnadu : రాష్ట్రంలో రానున్నది టీడీపీ - జనసేన ప్రభుత్వమని, వడియరాజుల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వడియరాజ్ సాధికార సమితి నాయకులు ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్ హాలులో వడియరాజ్ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జీవీ ఆంజనేయులు, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు హాజరయ్యారు.
వైసీపీ పాలనలో వడియరాజులకు చేసిన మేలు ఏమీ లేదని జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. టీడీపీ అంటే బీసీల పార్టీ అని, ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీకి బీసీల్లో ప్రధానంగా వడ్డెరలు అండగా నిలిచి విజయాల్లో కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు వడ్డెరలకు రూ.145 కోట్లతో కార్పొరేషన్ ఇచ్చారని, పనిముట్లు, రుణాలు ఇచ్చి అభివృద్ధికి సహకరించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సత్యపాల్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్రెడ్డి బీసీల అణిచివేత లక్ష్యంగా పాలన చేస్తున్నారని ఆరోపించారు.