మైసూరు ప్యాలెస్‌లో దసరా ఏనుగుల బీభత్సం- వీడియో చూశారా? - Elephants Fight In Mysore Palace - ELEPHANTS FIGHT IN MYSORE PALACE
🎬 Watch Now: Feature Video
Published : Sep 21, 2024, 5:16 PM IST
Elephants Fight In Mysore Palace : కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్‌లో రెండు దసరా ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పరస్పరం దాడి చేసుకున్న ఏనుగులు రాజభవనం నుంచి బయటకు పరుగు తీశాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి 7.45 గంటల సమయంలో జరిగింది. ధనంజయ్ అనే గజం, కంజన్ అనే ఏనుగును ప్యాలెస్‌లోని జయ మార్తాండ ద్వారం వరకు తరిమింది. అనంతరం రెండు ఏనుగులు దొడ్డకెరె మైదాన్ సమీపంలోని బారికేడ్‌ను తోసుకుని రోడ్డుపైకి పరుగు తీశాయి. దీంతో అక్కడ ఉన్న పర్యటకులు, స్థానికులు, అధికారులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అటవీ శాఖ సిబ్బంది, గజరాజులను వెంటనే ప్యాలెస్ ఆవరణలోకి తీసుకెళ్లారు. సమయస్ఫూర్తితో స్పందించి పరిస్థితి అదుపులోకి తీసుకురావడం వల్ల, అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర వన్యప్రాణి విభాగం అధికారి డాక్టర్ ప్రభు గౌడ స్పందించారు. ప్యాలెస్ ఆవరణలో ధనంజయ్, కంజన్ మధ్య గొడవ జరిగి రెండు ఏనుగులు బయటకు వచ్చాయని ధ్రువీకరించారు. సిబ్బంది, మావటి వాళ్ల సమయస్ఫూర్తితో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఇప్పుడు రెండు ఏనుగులను తిరిగి లోపలికి తీసుకువచ్చామని అవి ప్రశాంతంగా ఉన్నట్లు వెల్లడించారు.