నేరస్థుడి నుంచి లక్షల్లో డబ్బు వసూలు - ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు - sp anburajan orders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 10:27 PM IST
Three Constables Dismissed: నేరస్థుడి నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు రుజువు కావటంతో అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఉత్తర్వులిచ్చారు. కరుడుగట్టిన నేరస్థుడు సాంబయ్య శెట్టి నేరాలపై 2012లో అనంతపురం సీసీఎస్ పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, నిందితుడు సాంబయ్యశెట్టిని ప్రకాశం జిల్లా గిద్దలూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అనంతపురం తీసుకొచ్చి విచారణ జరిపారు. ఈ క్రమంలో సాంబయ్య శెట్టి నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారని ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రవీణ్ కుమార్, ఫరూఖ్ బాష, ఆనంద్ బాబులపై ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై పోలీసు అధికారులు నిందితుడిని విచారించగా, తన వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారని సాంబయ్యశెట్టి ముగ్గురు కానిస్టేబుళ్ల పేర్లు చెప్పారు. దీన్ని అప్పట్లో తీవ్రంగా పరిగణించిన అధికారులు కానిస్టేబుళ్లు ప్రవీణ్ కుమార్, ఫరూఖ్ బాష, ఆనంద్ బాబులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలం పూర్తైనా వారిపై విచారణ పూర్తి కాకపోవటంతో, ముగ్గురు కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకున్నారు. ఈ విచారణ పూర్తై, కానిస్టేబుళ్లు నిందితుడు సాంబయ్య శెట్టి నుంచి డబ్బు తీసుకున్నారని ఆధారాలు లభించటంతో తాజాగా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు.