కనుల పండువగా తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం
🎬 Watch Now: Feature Video
Thirupatamma Rangula Mahotsavam in NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రెండేళ్లకోసారి జరిగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయంలో కొలువుదీరిన తిరుపతమ్మ, గోపయ్య స్వాములు సహా ఇతర పలు గ్రామ దేవతల దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను రెండేళ్లకోసారి జగ్గయ్యపేట తరలించి రంగులు వేసిన తర్వాత తిరిగి పెనుగంచిప్రోలుకు తీసుకురావటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో గురువారం ఆలయంలో తిరుపతమ్మ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గర్భాలయాల్లో ఉన్న విగ్రహాలను ముఖ మండపం వద్దకు తీసుకువచ్చి గ్రామదేవతలకు సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. విగ్రహాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా గ్రామంలోని రంగుల మండపానికి బయలుదేరారు. ఈ సందర్భంగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, పలు రకాల సాంస్కృతిక వేషధారణలతో భారీ జాతర నిర్వహించారు. ప్రధాన వీధిలో ఊరేగింపుగా వస్తున్న అమ్మవారి పరివార దేవతలకు గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలుకుతూ టెంకాయలు కొట్టి పూజలు చేశారు.