బాసర ఆలయంలో దొంగ హల్‌చల్ - హుండీలు, సీసీ కెమెరాల ధ్వంసం - నగదు చోరీ - Robbery in Basara Temple - ROBBERY IN BASARA TEMPLE
🎬 Watch Now: Feature Video
Published : Aug 16, 2024, 1:24 PM IST
Robbery in Basara Temple : నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయంలో బుధవారం రాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశాడు. సుమారు 2 గంటల పాటు ఆలయంలో కలియ తిరిగి, ఓ హుండీని పగుల గొట్టడంతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. ఇంత జరుగుతున్నా విధుల్లో ఉన్న హోంగార్డులు గుర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎప్పటిలానే రాత్రి 8.30 గంటలకు హారతి ఇచ్చిన తరవాత ఆలయాన్ని మూసివేశారు. ఇక్కడ రోజూ రాత్రి ఆరుగురు హోంగార్డులు విధులు నిర్వర్తిస్తారు.
బుధవారం రాత్రి ఇద్దరు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కాగా నలుగురు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. వారి కళ్లుగప్పి ఓ దొంగ రాత్రి 10.20 గంటల సమయంలో క్యూలైన్ల మీదుగా నడుచుకుంటూ వచ్చి గోశాల పైనుంచి ఆలయంలోకి దిగాడు. మొదట దత్తాత్రేయ ఆలయం ముందున్న హుండీని ధ్వంసం చేసి నగదు తీసుకున్న నిందితుడు ప్రధానాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం వెనకాల ఉన్న హుండీలు, ప్రసాదం కౌంటర్‌లను ధ్వంసం చేశాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన హోంగార్డులను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సుమారు 20వేల రూపాయలు చోరీ జరిగిందని భావిస్తుండగా ఆలయంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.