ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు: గంటా శ్రీనివాసరావు - ఎన్నికల్లో ఏజెంట్లుగా వాలంటీర్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 1:54 PM IST
TDP Leader Ganta Srinivasa Rao : రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలు కాబోతుందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కానీ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో అక్రమాలు, అరాచకాలు చేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లే ఏజెంట్లుగా కూర్చోవాలి : ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాలోచనలతో దొంగ ఓట్లు చేర్పించేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఉత్తరాంధ్రరో ఉన్న ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్రమాలకు తెర లేపారని, అప్పుడు అధికార పార్టీకి ఓటు వేయని వాళ్లకు సంక్షేమ పథకాలు ఆపేయాలని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం వాలంటీర్లకు ఎటువంటి నియమాలు లేనందున సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లే ఎలాగైనా ఓట్లు వేయించాలని, అవసరమైతే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చోవలసిన అవసరం ఉంటుందని అన్నారని పేర్కొన్నారు. ఆ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారు : అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం సభలో అక్కడ ఫొటోలు, వీడియోలు తీస్తున్న ఫొటో జర్నలిస్టుపై దాడి చేసిన సన్నివేశాలు ఎంత కిరాతకంగా ఉన్నాయో చూశామని అన్నారు. జగన్ ప్రభుత్వంలో మీడియాపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పదే పదే నవరత్నాలు అమలు చేశామని చెప్పిన ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని ఆయన అన్నారు.