రెండేళ్ల చిన్నారి మృతికి కారణమైన దంపతుల మధ్య గొడవ - రెండేళ్ల చిన్నారి మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 1:58 PM IST
Suicide Attempt Kid Death: దంపతుల మధ్య గొడవ అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి మృతికి దారి తీసింది. ఈ విషాదకర ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే: జిల్లాలోని నంబులపూలకుంట మండలం మల్లెంవారిపల్లికి చెందిన గణేశ్, శ్రావణి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి తన రెండేళ్ల కుమార్తె సాత్వికతో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
శ్రావణి బావిలోకి దూకడాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే నీటిలోకి దూకి ఆమెను బయటకు తీశాడు. అయితే తాను చిన్నారితో పాటు బావిలోకి దూకినట్లు ఆటోడ్రైవర్‌కు శ్రావణి తెలిపింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు అతడు ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. ఈలోగా గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి సాత్విక మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కదిరి గ్రామీణ సీఐ వెంకటేశ్వర్లు చిన్నారి మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.