తల్లిదండ్రులకు గుడి కట్టి పూజలు చేస్తున్న కుమారులు - ఎక్కడంటే? - Sons Built For Parents Temple News
🎬 Watch Now: Feature Video
Published : Feb 3, 2024, 10:58 AM IST
Sons Built Temple For Their Parents In Mahabubabad : నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన తల్లితండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టకుండా ఇంటి నుంచి గెంటివేసే వారు ఎందరో ఉన్నారు. మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఇలాంటి రోజుల్లో, మరణించిన తల్లిదండ్రులకు దేవాలయం నిర్మించారు. అందులో వారి విగ్రహాలను ప్రతిష్ఠించి వారి జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శేషయ్య, ఎల్లమ్మ దంపతులు కూలీ పనులు చేస్తూ తమ ముగ్గురు కుమారులను చదివించి ప్రయోజకులను చేశారు.
అమ్మ, నాన్నలకు గుడి కట్టించిన పిల్లలు : పెద్ద కుమారుడు వెంకట్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఫార్మసిస్టుగా, రెండో కుమారుడు విజయ్ విద్యుత్ శాఖలో డీఈగా, చిన్న కుమారుడు జనార్ధన్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు కుమారులు ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థితిలో స్థిరపడ్డారు. కనిపించని దేవతల కన్నా, కని పెంచి, కష్టపడి చదివించి, మంచి ప్రయోజకులను చేసిన కన్న తల్లిదండ్రులే నిజమైన దేవుళ్లుగా భావించి, వారి తదనంతరం మందిరం నిర్మించి స్మరించుకుంటున్నారు. తల్లిదండ్రుల జయంతి, వర్ధంతి, పండుగ రోజుల్లో ఈ గుడికి వెళ్లి పూజలు చేస్తారు.