కృష్ణపట్నం పోర్టుకు ఖాళీ కంటైనర్ల వెజల్ తీసుకువచ్చి డ్రామాలాడుతున్నారు- టీడీపీ నేత సోమిరెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 6:30 PM IST
Somireddy Chandramohan Reddy Comments: అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఖాళీ కంటైనర్ల వెజల్ తీసుకువచ్చి డ్రామాలాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కంటైనర్ టెర్మినల్ మూతపడుతుందని గత నెల 20న తాను బయటపెట్టినట్లు తెలిపారు. మంత్రి కాకాణి తాజాగా కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. పోర్టుకు 2,200 కంటైనర్లతో వెజల్ వచ్చిందని కాకాణి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే, అవి ఖాళీ కంటైనర్ల మాత్రమే అని వెల్లడించారు. కేరళలో పోర్టు రద్దీగా ఉండటంతో అక్కడ దించాల్సిన కంటైనర్లను కృష్ణపట్నం పోర్టుకు తరలించారని తెలిపారు.
కృష్ణపట్నం పోర్టుకు వచ్చింది ఎగుమతులు, దిగుమతుల కోసం వచ్చిన వెజల్ కాదని సోమిరెడ్డి పేర్కొన్నారు. వెజల్ వచ్చిందని కొందరు ఎగుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా, కంటైనర్ల రవాణా రద్దయిందని పోర్టు యాజమాన్యం ప్రకటించిదన్నారు. కంటైనర్ టెర్మినల్ యథావిధిగా కొనసాగుతుందని పోర్టు యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని ఒక్క ప్రకటన కూడా చేయలేదని సోమిరెడ్డి విమర్శించారు. టెర్మినల్ మూసేస్తే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు చెందిన ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. ఏడు జిల్లాల రైతులు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టెర్మినల్ కార్యకలాపాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కంటైనర్ టెర్మినల్ మూతపడితే మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండనని ప్రకటించిన కాకాణి ఇప్పుడేమి సమాధానం చెబుతారని సోమిరెడ్డి నిలదీశారు. ఎగుమతులు, దిగుమతులు లేకుండా వచ్చే వెజల్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.