పార్టీ బలోపేతమే లక్ష్యం- పొత్తుల అంశంపై అధిష్ఠానానిదే నిర్ణయం: పురందేశ్వరి
🎬 Watch Now: Feature Video
Purandeswari Comments on Party Alliances: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పొత్తులపై అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పొత్తుల వ్యవహారం అంతా దిల్లీలోనే నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తాము మాత్రం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'పల్లెకు పోదాం' వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో దీన్‌దయాళ్ వర్ధంతి కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన పలువురికి ఆమె కండువా కప్పి ఆహ్వానించారు.
బీజేపీ తన ప్రస్థానాన్ని ఇద్దరు పార్లమెంటు సభ్యులతో ప్రారంభించింది. ప్రస్తుతం 303మంది సభ్యులు ఉండగా రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 350మందికి చేరే స్థాయికి బీజేపీ ఎదుగుతోంది. పొత్తుల విషయంపై పరిస్థితులను బట్టి పార్టీ నేతలు సమీక్షించుకుని సరైన నిర్ణయం తీసుకుంటారు. పొత్తుల మీద ఆధారపడి బీజేపీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. పార్టీ బలోపేతం కోసమే 'పల్లెకు పోదాం' కూడా కార్యక్రమం చేపట్టాం. రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. కార్యకర్తల మధ్య ఎటువంటి అసమ్మతి లేదు పార్టీని బలపరుచుకోవడమే తమ లక్ష్యం. -పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు