ప్రత్తిపాటి శరత్ కస్టడీ పిటిషన్ - తీర్పు ఈ నెల 6కి వాయిదా - ప్రత్తిపాటి శరత్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 10:15 AM IST
Prathipati Saraths Custody Petition : అవెక్సా కార్పొరేషన్‌లో ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తి అయిందనీ, ఈ దశలో నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని శరత్ తరఫున డిఫెన్స్ న్యాయవాది కిలారు బెనర్జీ వాదనలు వినిపించారు. బోగస్ పత్రాలతో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందారని చెబుతున్న సమయంలో శరత్ కంపెనీలోకి ఇంకా ప్రవేశించలేదన్నారు. కేవలం 67 రోజులు మాత్రమే ఆ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నారని వివరించారు. లేని సమయంలో జరిగిన వాటితో నిందితుడికి సంబంధం లేదన్నారు. పన్ను ఎగవేత, నిధుల మళ్లింపు కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని మాచవరం పోలీసులు ఒకటో ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్‌పై సోమవారం సాయంత్రం వాదనలు మొదలయ్యాయి.
జీఎస్టీ నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టం ఉందని దానిని కాదని ఐపీసీ కింద పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని న్యాయవాది ప్రశ్నించారు. మాచవరం స్టేషన్ పరిధిలో నేరం జరగనప్పుడు అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడం కుదరదన్నారు. కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని అభ్యర్థించారు. నిందితుడు శరత్ తన తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనీ, వీటిపై మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నందున పోలీసు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున హైకోర్టు పీపీ దుష్యంత్‌రెడ్డి వాదించారు. దీనిపై తుది తీర్పు కోసం ఈ నెల 6వ తేదీకి న్యాయాధికారి వాయిదా వేశారు.