ముంపులోనే ముమ్మిడివరం - Floods in konaseema district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 8:09 PM IST
People Suffering Due to Heavy Floods in Konaseema District : వర్షాలు తగ్గుముఖం పట్టినా కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని లంక గ్రామాల్లో వరద ఉద్ధృతి మాత్రం తగ్గడంలేదు. ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు వరదనీటిలో మునగడంతో రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల చుట్టూ వరదనీరు చేరడంతో ఇంట్లోని వారు బయటకు రాలేక, బయటి వారు ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు మంచినీరు తప్ప ఇంకేమీ ఇవ్వలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున తమను ఆదుకునేవారే లేకుండా పోయారని వాపోయారు. పొలాలు ముంపు బారిన పడటంతో పంటలు నీటిలో నానుతున్నాయి. ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 3,500 ఎకరాల విస్తీర్ణంలోని పంటలు దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.