కన్నోళ్లపైనే కర్కశం - బిడ్డను నమ్మి రోడ్డుపాలైన వృద్ధ దంపతులు - Old Couple Suffering From Shelter
🎬 Watch Now: Feature Video
Old Couple Suffering From Shelter in West Godavari : కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న బిడ్డలకే కానోళ్లయారు. ఒంట్లో ఉన్న శక్తినంతా వారి కోసం దారపోసి ప్రయోజకులను చేస్తే నిలువ నీడ లేకుండా చేశారు. కన్న బిడ్డలేగా అని ఉన్న ఆస్తినంతా రాసిచ్చేశారు. కానీ వారు చివరకు నిలువ నీడ లేకుండా చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజులుగా నిలువ నీడ లేకుండా వృద్ధ దంపతులు ఇబ్బందులు పడుతున్నారు.
భీమవరం పట్టణంలోని నాచువారి సెంటర్‌కు చెందిన డోకల నాగన్న, అప్పాయమ్మ దంపతులు తమకున్న సెంటున్నర స్థలంలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమర్తె ఉన్నారు. తమను బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో చిన్న కొడుకు సోమేశ్వరరావుకు ఆ స్థలాన్ని రాసిచ్చారు. సోమేశ్వరరావు దాన్ని వేరే మహిళకు విక్రయించాడు.
అప్పటి నుంచి గుడిసెను ఖాళీ చేయాలంటూ తల్లిండ్రులపై ఒత్తిడి తెస్తూ వచ్చాడు. మాట వినలేదని బెదిరింపులకు దిగుతూ, దాడికి పాల్పడ్డాడు. అప్పటికీ వాళ్లు ఒప్పుకోకపోవడంతో గుడిసె నేలమట్టం చేసి ఆ వృద్ధ దంపతులకు గూడు లేకుండా చేశాడు. కుమార్తె తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తుండగా వీరు మాత్రం నిత్యం ఉదయం వేళ ఆ స్థలం వద్దకు చేరుకొని బాధపడుతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.