"డే విత్ సీబీఎన్" - రోజంతా సీఎం చంద్రబాబుతో ఉండేలా వినూత్న కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : 18 hours ago
Day with CBN Program : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని ఆ పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన డే విత్ సీబీన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎంతో ఉండే అవకాశాన్ని కల్పించారు.
సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో స్వీడన్ నుంచి వచ్చిన నవీన్ కుమార్ 5 నెలల పాటు టీడీపీ విజయం కోసం పని చేశారు. కుప్పం సహా శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట, చంద్రగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం నవీన్ శ్రమించారు. రోజంతా సీఎం నివాసంలో ఉన్న నవీన్ ముఖ్యమంత్రి రోజూ వారీ రివ్యూలు, పని తీరును గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐలు వివిధ దేశాల నుంచి ఎన్నికల సమయంలో సొంతూళ్లకు వచ్చి పని చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం అని సీఎం అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రం బాగుండాలనే బాధ్యతతో పని చేసిన ఎన్ఆర్ఐలందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఒక రోజంతా ఉండడంపై నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబును అభిమానించే వారికి, నేడు తనకు ఇచ్చిన అవకాశం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎంకు నవీన్ ధన్యవాదాలు తెలిపారు.