నాన్‌స్టాప్‌గా 12 గంటలు ఈత- తల్లీకొడుకుల రేర్ ఫీట్- ఆసియా రికార్డ్స్‌లో చోటు - Mother Son Non Stop Swimming
Published : Sep 6, 2024, 3:40 PM IST
Mother Son 12 Hours Non Stop Swimming : కర్ణాటక బెళగావికి చెందిన తల్లీకొడుకులు 12 గంటలపాటు నిరంతరాయంగా నీటిలో ఈది అద్భుత ఫీట్ సాధించారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా స్విమ్మింగ్ చేసి- ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన తల్లీకొడుకులను అందరూ అభినందిస్తున్నారు.
జ్యోతి కోరి అనే మహిళ స్థానిక కొడోళి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె కుమారుడు విహాన్ సెయింట్ జేవియర్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. స్వతహాగా స్విమ్మర్ అయిన జ్యోతి, కుమారుడికి ఈతలో మెళకువలు నేర్పింది. తల్లిని చూసి విహాన్ స్విమ్మింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఈ క్రమంలో బెళగావిలోని సువర్ణ JNMC స్విమ్మింగ్ పూల్ వద్ద స్విమ్మర్స్ క్లబ్ ఆఫ్ బెల్గామ్, అక్వేరియస్ స్విమ్ క్లబ్ బెల్గామ్ సంయుక్తంగా నాన్‌స్టాప్ స్విమ్మింగ్ రిలే నిర్వహించాయి. ఈ రిలేలో పాల్గొన్న జ్యోతి, విహాన్, నాన్‌స్టాప్‌గా 12 గంటల 22 నిమిషాలు ఈదారు. జ్యోతి 12 కిలోమీటర్లు ఈదగా, విహాన్ 18 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి రికార్డ్ సృష్టించాడు. అనంతరం జ్యోతి, విహాన్‌కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి రేఖా సింగ్ పతకాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జ్యోతి, తాను 2018నుంచి స్విమ్మింగ్ చేస్తున్నట్లు, ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపింది. భవిష్యత్తులో తామిద్దరం కలిసి మరిన్ని పోటీల్లో పాల్గొనాలనుకుంటున్నట్లు చెప్పింది. అమ్మతో కలిసి ఈ ఫీట్ సాధించడం సంతోషంగా ఉందన్న విహాన్, ఆమే తనకు ప్రేరణ అని తెలిపాడు.