ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - MLC Jeevan Reddy Comments
🎬 Watch Now: Feature Video
MLC Jeevan Reddy Comments on Harish Rao's Letter : నిరుద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు.
హరీశ్‌రావు ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చింది కేవలం లక్ష అరవై వేల ఉద్యోగాలేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టామని తెలిపారు. హరీశ్ రావుకు గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం ఉందా లేదా అనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పది వేల ఉపాధ్యాయుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందని తెలిపారు. టెట్ కూడా నిర్వహించామన్నారు. జగిత్యాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు.