సింహాచలం దేవస్థానంలో 945 కిలోల నెయ్యి సీజ్ - ఎమ్మెల్యే గంటా ఆదేశాలతో అధికారుల చర్యలు - MLA Ganta at Simhachalam Temple - MLA GANTA AT SIMHACHALAM TEMPLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2024, 7:55 PM IST
|Updated : Sep 21, 2024, 10:00 PM IST
MLA Ganta Inspected Quality of Ghee in Simhachalam Temple : విశాఖపట్నంలో ప్రఖ్యాత గాంచిన సింహాచలం ఆలయంలో ముడిసరుకుల నాణ్యతను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. నెయ్యి రుచి చూసి అధికారులపై మండిపడ్డారు. ప్రసాదం లడ్డూలోనూ నెయ్యి వాసన లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ దర్శనానికి వెళ్లిన ఆయన అన్న ప్రసాదాలు, లడ్డూ, పులిహోర తయారీ విభాగాలు, ముడిసరకుల స్టోర్‌ను పరిశీలించారు. నెయ్యి సహా ఇతర సరకులను ఆహార కల్తీపై నమూనాలు సేకరించి, అధికారులు వాటిని పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం గంటా మాట్లాడుతూ, సింహాచలంలో నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా సరఫరా చేస్తున్నారన్న ఆలోచన అధికారులకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నెయ్యి కిలో రూ.341కే సరఫరా చేస్తున్నారంటే నాణ్యత పరిశీలించరా? అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ వల్ల వచ్చిన అనర్ధాలే ఈ కల్తీ నెయ్యి సమస్యన్నారు. దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేటట్లుగా, ప్రసాదాలు నాణ్యంగా ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. వ్యవస్థలను చక్కదిద్దడానికి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులతోనూ గంటా శ్రీనివాసరావు సంభాషించి నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే గంటా ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆహార భద్రతాధికారులు సాయంత్రం 945 కిలోల నెయ్యి సీజ్ చేశారు. నెయ్యి ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి సరఫరా అయినట్లు ఆహార భద్రతాధికారి అప్పారావు తెలిపారు. నెయ్యి శాంపిల్స్, లడ్డూలో వాడే ఇతర పదార్థాలను సేకరించి లేబరేటరీకి పంపించామని వెల్లడించారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.