'100 రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు' - బాలినేనిపై ఎమ్మెల్యే దామచర్ల సంచలన వ్యాఖ్యలు - TDP DAMACHARLA ON BALINENI - TDP DAMACHARLA ON BALINENI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2024, 6:33 PM IST
DAMACHARLA JANARDHANA RAO COMMENTS ON BALINENI: అధికారం కోల్పోయి 100 రోజులు గడవక ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీని బాలినేని సర్వనాశనం చేశారన్నారు. జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఏ పార్టీలోకి వెళ్లినా, కేసుల నుంచి బాలినేని, ఆయన కుమారుడు తప్పించుకోలేరని హెచ్చరించారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటామన్నారు. పార్టీలు మారే పరిస్థితి వస్తే రాజకీయాలు మానుకుంటామని స్పష్టం చేశారు. కాగా తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీని వీడిన విషయం తెలిసిందే. అదే విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సైతం ఇప్పటికే బాలినేని భేటీ అయ్యారు. ఈనెల 26న బాలినేని శ్రీనివాస్‌తోపాటు లారి రోశయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో బాలినేనిపై దామచర్ల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మరోవైపు దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు. వైఎస్సార్సీపీ ఉన్న ఇబ్బందుల వలనే పార్టీ మారాల్సి వచ్చిందని బాలినేని తెలిపారు. జనసేన పార్టీ అభివృద్ధి కోసం తన సాయ శక్తులా పనిచేస్తానని అన్నారు. దామచర్ల జనార్ధన్ తనపై చేస్తున్న వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదన్నారు. ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాసినట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పవన్ కల్యాణ్‌కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.