అంతా ఖాళీ చేసి ఇచ్చారు - ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు : సీతక్క - seethakka Fires on Brs
🎬 Watch Now: Feature Video
Published : Jan 20, 2024, 3:35 PM IST
Minister Seethakka Review Meeting in Warangal : బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులకు అన్యాయం జరిగిందనడానికి, పెండింగ్ బిల్లులపై కేటీఆర్ మాట్లాడడమే ప్రత్యక్ష ఉదాహరణ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి, సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందన్న ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో కచ్చితంగా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి అందరికి తెలుసన్న ఆమె ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజల అవసరాల మేరకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల సమస్యల పరిష్కారం కోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు జరుగుతాయని మంత్రి అన్నారు. దీని కోసం ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించిందని తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా ములుగు నియోజకవర్గంలో ఇప్పటికి నీటి సమస్యలు ఉన్నాయని వాటిపైన మొదటగా దృష్టి సారించినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.