కొడుకుల మృతదేహాలతో 15కి.మీ నడిచిన తల్లిదండ్రులు! - Parents Walked With Dead Bodies
Published : Sep 5, 2024, 5:31 PM IST
Parents Walked With Children Dead Bodies : మహారాష్ట్రలోని గడ్చిరోలీలో మూఢనమ్మకాలను విశ్వసించినందుకు దంపతులకు పుత్రశోకం మిగిలింది. మంత్రగాడిని నమ్మినందుకు కల్లెదుటే కన్నబిడ్డల ప్రాణం పోతుంటే నిస్సహాయులుగా మిగిలిపోయారు. జ్వరం బారిన పడిన ఇద్దరు పదేళ్లలోపు కుమారులను ఆ తల్లిదండ్రులు ఆస్పత్రికి కాకుండా, భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. సకాలంలో వైద్యం అందక ఆరోగ్యం విషమించి ఆ ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ప్రాణాలు వదిలారు. పట్టిగావ్ గ్రామానికి చెందిన ఆ దంపతులకు ఆరు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
కొన్ని రోజులుగా వారికి జ్వరం రావడం వల్ల చుట్టుపక్కలవారి మాటలు నమ్మి ఆస్పత్రికి కాకుండా భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చిన్నారులకు అతడు ఏదో మూలికా ఔషధం ఇచ్చాడు. తర్వాత కొంతసేపటికే ఇద్దరు పిల్లల ఆరోగ్యం మరింత విషమించింది. స్థానిక జమిల్‌గట్ట పీహెచ్సీకి తీసుకెళ్లిన కొన్ని నిమిషాల్లోనే చిన్నారులు చనిపోయారు. అంబులెన్సు రాకపోవడం వల్ల కన్నుమూసిన కన్నబిడ్డలను భుజాన వేసుకున్న ఆ తల్లిదండ్రులు 15 కిలోమీటర్లు నడిచి స్వగ్రామం చేరుకున్నారు.
పోస్టుమార్టానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు: వైద్యులు
ఆ చిన్నారుల వయసు ఆరు, మూడు సంవత్సరాలని జమిల్‌గట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన ఆరోగ్యం క్షీణించడం వల్ల వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. తీసుకొచ్చేదారిలోనే వారి మృతి చెందినట్లు చెప్పారు. పోస్టుమార్టం చేయాలని చెప్పినప్పటికీ, వినకుండా ఆ మృతదేహాలను తీసుకొని వెళ్లిపోయారని చెప్పారు. తర్వాత వారిని వెనక్కి రప్పించి పోస్టుమార్టం నిర్వహించినట్లు వెల్లడించారు.