విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' - Marwadis Organized Kavadi Yatra
🎬 Watch Now: Feature Video
Marwadis Organized Kavadi Yatra in Vishaka : ఏటా పవిత్ర శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం మార్వాడీలకు ఎంతో ప్రత్యేకత. ఆ రోజు కావడి శోభాయాత్ర చేయడం అనవాయితీ. ఉత్తర భారతదేశం తరహాలోనే విశాఖలో ఘనంగా ఈ కావడి యాత్రను ఏటా నిర్వహిస్తారు. తెల్ల తెల్లవారుతుండగానే కాషాయ వస్త్రాలు ధరించి.. హర హర శంభో శంకర అంటూ యాత్ర చేపడతారు. కొండల నుంచి జాలువాడిన జల ధార నుంచి నీటిని పట్టుకొని వాటిని కావడి మోస్తారు. కిలోమీటర్ల మేర నడిచి ఆ గంగాజలంతో పరమశివుడికి అభిషేకం చేస్తారు.
విశాఖలో ఈరోజు మార్వాడి మంచ్ ఆధ్వర్యంలో కావడి యాత్రని ఘనంగా నిర్వహించారు. ఈ కావడి యాత్రలో దాదాపు 3 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఏటా శ్రావణమాసంలో మాధవధారలోని శివాలయం నుంచి సహజ సిద్ధ నీటిని కుండల్లో నింపి తీసుకెళ్తారు. కావడితో మురళినగర్, తాడిచెట్లపాలెం, సిరిపురం మీదుగా వెళ్లి బీచ్లో ఉన్న శివాలయంలో అభిషేకం చేస్తారు. దీంతో కావడి యాత్ర పూర్తి అవుతుంది. ఈ యాత్రలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ పాల్కొంటారు. కావడి చేతబట్టిన దగ్గర నుంచి కింద పెట్టకుండా ఈ యాత్ర మొత్తం పూర్తి చేస్తారు. ప్రతి ఒక్కరూ పాదరక్షలు లేకుండా కాషాయ వస్తాలు ధరించి కావడి యాత్రలో పాల్గొంటారు. శ్రావణమాసంలో ఈ కావడి యాత్ర చేస్తే పరమశివుని అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.