ఒక్క నిమ్మకాయ ధర రూ.35వేలు!- స్పెషల్ ఏంటంటే? - Lemon Sold For 35000 Tamil Nadu
🎬 Watch Now: Feature Video
Published : Mar 10, 2024, 8:03 PM IST
Lemon Sold For Rs 35000 : తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని ఓ శివాలయంలో ఒక్క నిమ్మకాయ ఏకంగా రూ.35వేలకు అమ్ముడుపోయింది! అయితే ఆ నిమ్మకాయను గర్భాలయంలో మూడు రోజులపాటు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. అనంతరం శనివారం రాత్రి ఆ నిమ్మకాయకు వేలం వేశారు. ఈ వేలంలో దానిని రూ.35,000 పెట్టి కొనుగోలు చేశాడు అదే జిల్లాకు చెందిన ఓ శివ భక్తుడు.
జిల్లాలోని శివగిరి గ్రామం సమీపంలో ఉన్న పజపూసైయన్ శివాలయంలో ఈ వేలం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శివుడికి సంబంధించిన కొన్ని రకాల వస్తువులను శివరాత్రి తర్వాత రోజు వేలం వేస్తారు. ముఖ్యంగా గర్భాలయంలో పెట్టిన నిమ్మకాయ, దేవుడి కోసం చేయించిన వెండి ఉంగరంతో పాటు, గుడిలో ఉండే కొన్ని వెండి నాణేలను, పండ్లను కూడా వేలం వేస్తారు. ఇదే ఆనవాయతీ ప్రకారం ఈసారి కూడా వాటికి వేలం పాట నిర్వహించారు.
ఈ వేలంలో ఈరోడ్ జిల్లా మోదకురిచ్చికి చెందిన రవి అనే ఓ శివ భక్తుడు ఏకంగా రూ.35వేలు పలికి దేవుడు వద్ద ఉంచిన నిమ్మకాయను సొంతం చేసుకున్నాడు. వెండి ఉంగరాన్ని వేలం వేయగా రూ.14,300కు అమ్ముడుపోయింది. దేవుడికి చెందిన వెండి నాణేలను రూ.15,300కు కొనుగోలు చేశారు ఇతర భక్తులు. నిమ్మకాయ రూ.35వేలకు అమ్ముడుపోవడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.