ఎన్నికల్లో లబ్ది కోసమే మోదీ సర్కార్ సీఏఏ చట్టాన్ని తెచ్చింది : సీపీఐ నేత రామకృష్ణ - CPI leaders fire on bjp
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 8:17 PM IST
Left Parties Protest Against CAA in Vijayawada : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల నాయకులు ఆందోళనలు చేశారు. విజయవాడ లెనిన్ కుడలిలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, వివాదాస్పద చట్టం సీఏఏని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయబోమని తెగేసి చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం మత రాజకీయాలకు తెరలేపిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే సీఏఏ చట్టాన్ని బీజేపీ అమలు చేసిందని మండిపడ్డారు. వామపక్ష పార్టీలన్నీ సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.
అయితే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం-2019 లోనే పార్లమెంటు ఆమోదం పొందినా రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ సర్కారు బ్రహ్మస్త్రంలా ఈ చట్టాని బయటకు తీసింది.