మరో రిషికొండలా కోటప్పకొండ: జనసేన నేత సయ్యద్ జిలానీ - TDP Janasena meeting
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 6:20 PM IST
TDP and Janasena Leaders Meeting in Narasaraopeta : పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం గురువారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన ఇంఛార్జి సయ్యద్ జిలానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ, నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరాచకాలు తారాస్థాయికి చేరాయని దుయ్యబట్టారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గోపిరెడ్డి ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తే దాదాపు 38 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించారు. దానిపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికీ భయపడే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. గోపిరెడ్డి ఇలాఖాలోని నరసరావుపేటలో దాదాపుగా నాలుగు వేల మంది యువకులు గంజాయికి బానిసలు అయ్యారని తెలిపారు. అర్ధరాత్రి గంజాయి తాగుతూ యువకులు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు నరసరావుపేటలో లా అండ్ ఆర్డర్ అనేదే లేదని తెలిపారు. నియోజకవర్గంలో ఏం జరిగినా ముందు ఎమ్మెల్యే చెబితేనే పోలీసులు స్పందిస్తారు, లేదంటే అటువైపు చూడరని మండిపడ్డారు. గోపిరెడ్డి హయాంలో కోటప్పకొండ మరో రిషికొండలా మారిందని ఆరోపించారు. అదేవిధంగా ములకలూరు చెరువులోని మట్టిని అక్రమంగా తరలించి గోపిరెడ్డి అండ్ టీమ్ లక్షలాది రూపాయలు కొల్లగొట్టారని విమర్శించారు.